ఆధునిక జీవనశైలితో కంప్యూటర్లకు అతుక్కుపోవడంలో బిజీ ఉన్నప్పటికీ పనిచేసే చోట కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని కల్పించుకోవచ్చు. గుండెజబ్బులను నివారించాలంటే శారీరక శ్రమ అన్నది అత్యంత ముఖ్యమైన అంశo
80 శాతం రిస్క్ తగ్గే మార్గం!
జాగ్రత్తలు - సూచనలు
-ప్రపంచవ్యాప్తంగా పొగాకును నిషేధించాలి. పొగాకు సంబంధిత అలవాట్లయిన సిగరెట్లు, బీడీలు, గుట్కాల వంటి అలవాట్లు లేకపోతే గుండెపోట్ల అవకాశాలను 36 శాతం తగ్గించుకోవచ్చు.
-వారానికి కనీసం 5 రోజులన్నా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం 40 నిమిషాల పాటైనా వ్యాయామం చేస్తే గుండెపోటు అవకాశం 3 శాతం వరకు తగ్గుతుంది. సాధారణ వాకింగ్ అయినా చేయవచ్చు.
-స్థూలకాయం గుండెజబ్బులకు ప్రధాన శత్రువు. అందుకే నడుము చుట్టుకొలత 37 అంగుళాల కన్నా తక్కువ ఉంచుకోగలిగితే 12 శాతం రిస్కు తగ్గుతుంది.
-కూరగాయలు, పండ్లు, గింజలు, ముడి ధాన్యాలు, చేపలను తీసుకుంటే 18 శాతం అవకాశాలు తగ్గుతాయి. చేపలు తప్ప ఇతర మాంసాహారాన్ని తగ్గించాలి.
-రోజుకి కేవలం 2 పెగ్గులు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటే రిస్కు 11 శాతం తగ్గుతుంది. కాని మనదేశంలో 2008లో జరిగిన ఇంటర్ హార్ట్ అధ్యయనంలో ఆల్కహాల్ వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చని కూడా తెలిసింది. ఇదేకాకుండా ఈ ఆల్కహాల్ మొదలుపెడితే రెండు పెగ్గులతో ఆగకుండా దానికి పూర్తిగా బానిసలయ్యే ఉంది కాబట్టి తీసుకోకపోవడమే మంచిది.
పొద్దున్నే గుండెపోట్లు ఎందుకు?
నిద్రలోనే చనిపోయారనో, తెల్లవారుజామునే గుండెపోటు వచ్చిందనో అన్న మాటల్ని వింటూనే ఉంటాం. నిజమే ఉదయాన్నే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా పొద్దున 4 నుంచి 8 గంటల మధ్య ఎక్కువమందిలో గుండెపోటు రావడం చూస్తుంటాం. ఈ సమయంలో శరీర పరిస్థితులు కూడా గుండెపోటు అవకాశాన్ని పెంచుతాయి. బయలాజికల్ సైకిల్‌లో భాగంగా ఈ సమయంలో శరీరంలోని హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు (క్లాటింగ్ ఫ్యాక్టర్స్), ప్లేట్‌లెట్లు మందంగా అవుతాయి. కాబట్టి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తప్రసారానికి అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువ. రసాయనాలు అసమతుల్యత ఎక్కువ. బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో గుండెపోటుకు గురయ్యే రిస్కు ఎక్కువ అవుతుంది. అందుకే బీపీ, కొలెస్ట్రాల్, స్టాటిన్స్ మందులు రాత్రిపూట మర్చిపోకుండా తప్పనిసరిగా వేసుకోవాలి.
గుండెపోటు వస్తే..?
గుండెపోటు వచ్చినప్పుడు ఆందోళన పడకుండా అందుకు ఏం చేయాలన్నది ఆలోచించడం అన్నింటి కన్నా ముఖ్య విషయం. ఆందోళన పడితే సమస్య మరింత జటిలం అవుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చిన మొదటి గంట లోపే డాక్టర్‌ను కలవడం అవసరం. పేషెంటు స్థితిని బట్టి ఆస్ప్రిన్, స్టాటిన్ లాంటి మందును ఇస్తారు. అలాగని ఇంటి దగ్గరే ఏ ఆస్ప్రిన్‌నో వేసుకునే ప్రయత్నం చేయవద్దు. కొందరిలో ఇది తీవ్రమైన దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితిలో సార్బిట్రేట్ నాలుక కింద పెట్టుకుంటే వెంటనే రక్తనాళాలు కొంచెం తెరుచుకుని రక్తప్రసరణ జరుగుతుంది. అయితే అది కచ్చితంగా గుండెపోటు అని తెలిసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. లేకుంటే దీనివల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. స్పృహ తప్పొచ్చు కూడా. అందువల్ల వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.
No comments:
Post a Comment